సుల్తానాబాద్, (ప్రభ న్యూస్): రైతులు అభివృద్ధి చెందాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సుల్తానాబాద్‌లో శీతల గిడ్డంగుల నిర్మాణం చేపట్టారని పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నూతనంగా 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన శీతల గిడ్డంగులను ఆయన ప్రారంభించారు. అలాగే మార్కెట్లో రైతుల సౌకర్యార్థం 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన కూరగాయలు, పండ్లు ఇతర నిత్యావసర పదార్థాలను నిల్వ చేసి విక్రయించేందుకు గిడ్డంగుల నిర్మాణం చేపట్టామని, తద్వారా తాము పండించిన పంట వృధా కాకుండా తాజాగా ఉండేందుకు గిడ్డంగులు ఉపయోగపడతాయన్నారు.
అలాగే రైతులు మార్కెట్ కు వచ్చిన సందర్భంలో వారికి అందుబాటులో ఉండే విధంగా 10 లక్షల రూపాయలతో క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మార్కెట్లో విక్రయించే పండ్లు, అల్లం, ఉల్లిపాయ, ఎల్లిగడ్డ, మిర్చి లాంటివి తాజాగా ఉండేందుకు ఉపయోగపడతాయన్నారు.