తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రానున్నారు. ఈనెల 20న మునుగోడు బహిరంగ సభ అనంతరం కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్ కు ముఖ్యమంత్రిగా రానున్నట్లు అధికార యంత్రాంగానికి సమాచారం అందింది. 20న రాత్రి తెలంగాణ భవన్ లో సీఎం బస చేయనున్నారు. 21న కరీంనగర్ లోని వి కన్వెన్షన్ లోని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను సీఎం ఆశీర్వదించనున్నారు.
అనంతరం గోదావరిఖనిలో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరవుతున్నట్లు సమాచారం. సీఎం పర్యటన కోసం కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం బందోబస్తు ఏర్పాట్లును కరీంనగర్ సి పి సత్యనారాయణ పర్యవేక్షించారు. సీఎం రాక సందర్భంగా తెలంగాణ భవన్ తో పాటు సీఎం పర్యటించే రహదారుల వెంట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరిఖనిలో ఎన్టిపిసి హెలిప్యాడ్ తో పాటు ఎమ్మెల్యే కుమారుడి వివాహం జరిగే కళ్యాణ మండపం పరిసరాలను గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతల లక్ష్మీనారాయణ, గోదావరిఖని వన్ టౌన్ సిఐ రమేష్ బాబు, టూ టౌన్ సిఐ కుచన శ్రీనివాస్, రామగుండం ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ , గోదావరిఖని వన్ టౌన్ టు సిఐ రాజకుమార్, ఎన్ టి పి సి ఎస్ ఐ జీవన్ లు పరిశీలించారు.