Saturday, November 23, 2024

KNR: గ్రీనరీ పెంపు లక్ష్యంగా స్వచ్చదనం – పచ్చదనం.. క‌లెక్ట‌ర్

పెద్దపల్లి, (ప్రభ న్యూస్) ఆగస్టు -5: పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్ నగర్ చౌరస్తా, మసీదు, జెండా, సివిల్ ఆసుపత్రి మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు అవగాహన ర్యాలీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ… పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ముందస్తుగా ర్యాలీ చేపట్టామని తెలిపారు. స్వచ్చదనం – పచ్చదనం ర్యాలీలో వివిధ పాఠశాల విద్యార్థులు, కళాకారులు, మెప్మా మహిళా సంఘాల పెద్ద ఎత్తున పాల్గొన్నాయని, వీరు ఇంటికి వెళ్లిన తరువాత ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, గ్రీనరీ పెంచే దిశగా మొక్కలు నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలన్నారు.

నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాలను ప్రతిరోజూ పక్కాగా నిర్వహించి రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లాను ప్రథ‌మ స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలన్నారు. అనంతరం వ్యాస రచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ అరుణశ్రీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement