పెద్దపల్లి : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలపై రైతులు, సామాన్య ప్రజలు, పోరాడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కల్లాల నిర్మాణం పూర్తయ్యాక, వ్యవసాయ కల్లాలకు ఉపాధి హమీ నిధులు ఇవ్వమనడం సరికాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేఖిస్తుందన్నారు. రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే కల్లాలు వ్యవసాయంలో భాగం కాదని వక్రభాష్యాలు చెప్పి రైతన్నలను, వ్యవసాయ కూలీల పొట్ట కొడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రైతన్నల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కేంద్రం అవలంభిస్తున్న రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేఖ విధానాలకు నిరసనగా రైతుల పక్షాన పోరాడుతున్నామన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ, రైతాంగానికి, సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం చేసే నిర్ణయాలను తీసుకుంటుందన్నారు.పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ తెలంగాణ పై వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హమీ పథకం క్రింద నిర్మించిన కల్లాలకు నిధులు ఇవ్వకుండా మోకాలడ్డుతుందన్నారు. రైతన్నలు ఆర్థికంగా బలోపేతం కావాలని సీఎం కేసీఆర్ ఎన్నో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలోనే అతిపెద్దదైన వ్యవసాయాన్ని రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకునేలా కేంద్రానికి ఒక విధానమే లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం మేయర్ అనిల్, ముత్యాల బలరాం రెడ్డి, కందుల సంధ్యారాణి, ఉప్పు రాజ్ కుమార్ తో పాటు బిఅరెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.