జైశ్రీరామ్, జై తెలంగాణ అనడం కాదు
లక్ష పెళ్లిళ్లకు లక్ష తులాల బంగారం బాకీ పడిన కాంగ్రెస్
బీజేపీ చేసిన ఒక్క అభివృద్ధి చూపిన దేనికైనా రెడీ
సిరిసిల్ల ఎన్నికల కార్నర్ మీటింగ్ సభల్లో కేటీఆర్
ఉమ్మడి కరీంనగర్, ప్రభ న్యూస్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపడం వల్లే ప్రజలు మోసపోయారని, ప్రభుత్వం పడిపోయిందని, ప్రజలకు దరిద్రం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడు రాజధర్మం పాటించమన్నాడే కానీ దేవుడి పేరుతో ఓట్లు అడగమనలేదని పేర్కొన్నాడు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ వేకువజాము నుండి పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కార్మిక క్షేత్రం బీవై నగర్ జెండా చౌరస్తా, వెంకంపేట హనుమాన్ చౌరస్తాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందని, తమ ప్రభుత్వంలో నేత కార్మికులకు 9 నెలల పాటు ఉపాధి ఉండేది, రూ.10 వేల నుండి రూ.20వేల వేతనాలు వస్తుండేవని, మూడు వేళ్లు నోటిలోకి పోయేవని, ఇప్పుడు నాలుగున్నర నెలలుగా సాంచాలు మూత పడ్డాయని, బతుకమ్మ చీరెలు, క్రిస్మస్ కిట్లు, రంజాన్ తోఫాలు లేవని, బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వకపోవడంతో నేత కార్మికులు రోడ్డున పడి, నేత ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందన్నారు.
ఆరు గ్యారంటీలలో ఒక్కటి కూడా అమలు కాలేదని, 4000 పెన్షన్ రాలేదని, మహిళల వివాహాలకు తులం బంగారం ఇస్తామని ఇవ్వలేదని, ఈ నాలుగు నెలల్లో లక్ష పెళ్లిళ్లు జరిగాయని, ఈ లెక్కన లక్ష తులాల బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని అంటూ కొనడానికి బంగారం షాపులే లేవా అని ప్రశ్నించారు. నమ్మి మోసపోయామని, సిగ్గు లేకుండా గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నట్టు చెబుతున్నారని దుయ్యబట్టారు. కరెంటు కోతలు పెరిగాయని, కేసిఆర్ ఉన్నప్పుడు సిరిసిల్ల బ్రిడ్జి వద్ద సముద్రంలా ఉండేదని, కానీ ఇప్పుడు దరిద్రం వచ్చి పడిందన్నారు. మోసపోతే గోసపడతామని కేసిఆర్ ముందే హెచ్చరించారని, అయినా ప్రజలు వినకుండా మోస పోయారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గాలి మాటలు చెప్పి మోసగించే వారి మాటలు నమ్మవద్దన్నారు. బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నదని, దేవుడు ఫోటోలు ఇంటింటికి పంచి ఓట్లు అడుగుతున్నదని ఆరోపించారు. గుడి ముఖ్యం అనుకుంటే కేసిఆర్ యాదగిరిగుట్ట దేవాలయాన్ని ప్రాచీన శిల్పకలకు అద్దం పట్టేలా యాదాద్రి నిర్మించారని, గుడి కట్టమంటే ప్రాచీన శిల్పకళలతో నవీన సంపదలతో ఆధునిక దేవాలయం నిర్మించారన్నారు.
తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధిని చెప్పుకుంటున్నానే తప్ప జై తెలంగాణ, జై లక్ష్మీనరసింహస్వామి అంటూ దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం లేదన్నారు. చేసిన అభివృద్ధిని చెప్పుకొని ఓట్లు అడగాలన్నారు. అలాగే కేసిఆర్ ఆధునిక దేవాలయాలు, ప్రాజెక్టులు నిర్మించి వాటికి దేవుళ్ళ పేరు పెట్టారని, మిడ్ మానేరు నిర్మించి సిరిసిల్లకు సముద్రాన్ని తెచ్చారని కేటీఆర్ వెల్లడించారు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని, మనం హిందువులం కాదా, మనం శ్రీరాముని పూజించలేదా, మొక్క లేదా, బొట్టు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. మోడీ నుండి ఒక్క రూపాయి అన్న లాభం జరిగిందా ఎందుకు ఓటు వేయాలన్నారు. బండి సంజయ్ గెలిచిన ఐదు సంవత్సరాలలో ఒక్క శిలా ఫలకం అయినా వేయలేదని, ఐదేళ్లు గాలిలో తిరిగాడని, కష్టాల్లో ఒక్కనాడు ఇక్కడి ప్రజల వద్దకు రాలేదని, నేతన్నలను, రైతులను కలువ లేదన్నారు. 2014లో మోడీ విదేశాలలో ఉన్న నల్లధనం తీసుకువచ్చి ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలలో రూ. 14 లక్షలు వేస్తానని వేసిండా అని ప్రశ్నించారు. కేసిఆర్ ఇస్తున్న నెలకు 2000 రూపాయలు తప్ప బ్యాంకులో ఏమీ వేయడం లేదన్నారు.
దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగమని దేవుడు చెప్పలేదని, దేవుడు రాజధర్మం పాటించమన్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని ఫిరం చేసిన మోడీ ప్రభుత్వానికీ ఎందుకు ఓటు వేయాలని, భారతదేశంలో ప్రధానమంత్రి అనడంలేదని, ఫిరమైన ప్రధానమంత్రి అని ప్రజలు అంటున్నారని వెల్లడించారు. బీజేపీ ఒక్క పని అన్న సిరిసిల్లలో చేసిన అభివృద్ధి చూపెడితే దేనికైనా రెఢీ అని కేటీఆర్ సవాల్ చేశారు. చోట భాయ్, బడా భాయ్ కి ఓటువేయకుండా వారికి బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే వాళ్ళు చేతులు లేపండి, వినోద్ కుమార్ గెలుస్తారని తనకు నమ్మకం ఉందన్నారు. మతం పేరు మీద రాజకీయం చేసే వారిని నమ్మవద్దన్నారు. 13 తేదీన జరిగే లోక్ సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమాల్లో సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమ, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గుడ్ల మంజుల, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.