కరీంనగర్ పట్టణంలో అత్యంత సుందరంగా, ఆకర్షణీయంగా సుమారు రూ.200 కోట్లతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి సీసీ కెమెరాల నిఘాలో ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు వెల్లడించారు. కేబుల్ బ్రిడ్జి కోసం ప్రత్యేక పోలీసులను నియమించి వారికి శనివారం వాహనాలు కేటాయించారు. అనంతరం మాట్లాడుతూ… కరీంనగర్ పట్టణానికి మణిహారంగా ఉన్న కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన రోజు నుండే పట్టణ వాసులనే కాకుండా చుట్టుపక్కల వారిని కూడా విపరీతంగా ఆకర్షించడంతో ప్రజలు ప్రతిరోజు వేలాది మంది సందర్శించడం జరుగుతుందన్నారు. దీనివల్ల కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలగడం, వేలాది మంది సందర్శకులు ప్రతి రోజు రావడం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశమున్నందున, వాటిని దృష్టిలో ఉంచుకొని కేబుల్ బ్రిడ్జి పోలీస్ ని నియమించడం జరిగిందన్నారు. కేబుల్ బ్రిడ్జి పోలీస్ కి ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బందినీ, ఒక ఇన్నోవా వాహనము, రెండు మోటార్ సైకిల్ లతో పాటు ఇతర సామాగ్రిని అందించామన్నారు.
వీరు కేబుల్ బ్రిడ్జిపై పెట్రోలింగ్ చేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, అక్కడికి వచ్చే మహిళలు, బాలికలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, వాహనాల రద్దీ పెరిగిన సమయంలో క్రమబద్ధీకరించుటకు, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కరీంనగర్ కి మణిహారంగా ఉన్న కేబుల్ బ్రిడ్జి పరిసరాలను ఆకర్షణీయంగా ఉంచవలసిన బాధ్యత సందర్శకులపై కూడా ఉన్నదన్నారు. కేబుల్ బ్రిడ్జి సందర్శించే వేలాదిమంది సందర్శకులు ఐస్ క్రీములు చార్ట్, ఇతర తినుబండారాలు తిని బ్రిడ్జి పైన పడివేయడం వల్ల చెత్త పేరుకుపోయి కేబుల్ బ్రిడ్జి ఆకర్షణ దెబ్బతినే అవకాశం ఉందన్నారు.. సందర్శకులు తిను బండారాలు మొదలైన వాటిని ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా చెత్త కోసం నిర్దేశించిన డస్ట్ బిన్లను మాత్రమే వినియోగించాలని, కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఉన్న బటర్ ఫ్లై ఐలాండ్, జంక్షన్ వద్ద ఉన్న ఐలాండ్ ఇతర ఐలాండ్ పైన ఫోటోలు దిగుతూ కనిపిస్తున్నారన్నారు. ఫోటోలు ఐలాండ్ పక్కన నిల్చుని దిగితే ఎవరికీ ఇబ్బంది ఉండదని, ఈ ఫోటోలు ఐలాండ్ పైకి ఎక్కి దిగడం వల్ల ఐలాండ్ ఆకర్షణ పోయే అవకాశం ఉందన్నారు.
సెల్ఫీలు, వీడియోలు, ఇంస్టాగ్రామ్ ల కోసం రీల్స్ చేయడం కూడా పరిపాటిగా మారిపోయిందన్నారు. ఈ సంతోషంలో ఆదమరిచి సెల్ఫీలు, ఫోటోలు దిగే క్రమంలో ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా ఉందన్నారు. యువకులు మోటార్ సైకిళ్లను సరదా కోసం వేగంగా నడిపితే సందర్శకులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తోపుడు బల్లు, ఐస్ క్రీమ్ బళ్లు, చాట్ మొదలైన బండ్లు కేబుల్ బ్రిడ్జి పైకి వెళ్లడం వల్ల సందర్శకులకు, బ్రిడ్జి పై నుండి వెల్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని, తోపుడు బండ్లు బ్రిడ్జి పైకి అనుమతించబడవన్నారు. కేబుల్ బ్రిడ్జి పరిసరాలు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నవని ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి తప్పుడు పనులకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను బిగించి వాహనాలు నడపడం, విన్యాసాలకు పాల్పడే వారి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ తులా శ్రీనివాసరావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.