ధర్మారం : గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ధర్మారం మండలం నంది మేడారం బాలుర గురుకుల విద్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైనింగ్ హాల్‌ను పరిశీలించి పారిశుధ్యం, వసతులు సరిగా లేక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాల సీజన్‌లో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యాధులు ప్రబలడంతో పాటు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంటుందని మండిపడ్డారు. అనంతరం మాట్లాడుతూ… ప్రభుత్వం పేద విద్యార్థులను ప్రయోజకులుగా మార్చేందుకు గురుకులాలను ఏర్పాటు చేస్తూ లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని, లక్ష్యాన్ని నీరుగార్చేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన బోధన చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట మేడారం పాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement