Saturday, November 23, 2024

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : పెద్ద‌ప‌ల్లి కలెక్టర్ సంగీత

పెద్దపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, జిల్లాలో ఉన్న పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహం ఉన్న వంతెనలు రోడ్ల వద్ద రాకపోకలు నిలిపి వేయాలని ఆదేశించారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలోని ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయ‌తీ సెక్రటరీలు, అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే సంబంధిత మండల స్థాయి, అధికారులకు జిల్లాస్థాయి, అధికారులకు తెలియజేయాలని, భారీ వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కూలిపోయే ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వరద నీరు వచ్చే లోతట్టు ప్రాంతాలు ఉన్న గ్రామాలను గుర్తించి అవసరమైన మేర సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు, త‌హ‌సీల్దార్ లు, ఎంపీడీవోలు, ప్రజా ప్రతినిధులు, అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితిలో కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 7995070702ను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement