సుల్తానాబాద్ : తెలంగాణ ఆడపడుచులకు కానుకగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను అందిస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.. శుక్రవారం సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ… సబ్బండ వర్ణాలు ఏకమై ఎన్నో త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. పూలను కొలిచే సంస్కృతి, సాంప్రదాయం ఒక్క తెలంగాణలోనే ఉందని, ఇక్కడి ఆడపడుచులకు అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మకు ప్రభుత్వం కానుకగా చీరలను అందిస్తుందన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్‌తోపాటు తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.