Monday, November 25, 2024

KNR: బండి సంజయ్.. సమస్యల పరిష్కారానికి ఆ కార్యక్రమం చేపట్టాలి.. వెలిచాల

ఉమ్మడి కరీంనగర్, ప్రభ న్యూస్ బ్యూరో : కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్ ఘర్ తిరంగా పండుగ జరిగే సమయంలోనే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి హర్ ఘర్ రోజ్ గార్ కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సవాల్ విసిరారు. నిన్ను గెలిపించిన జన్మభూమి కోసం ఏమైనా గొప్ప పని చెయ్యక ఊరికే నేను డబుల్ పక్కా లోకల్ అని బాంబు లాంటి డైలాగులు కొడితే ఏం లాభమని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

బండి సంజయ్ ఎంతకాలం కరీంనగర్ ప్రజలకు ఈ నిరీక్షణ.. ఆవేదన అని ప్రశ్నించారు. ఎన్ని రోజులు ప్రజలు ఎదురుచూసేలా చేస్తావని ధ్వజమెత్తారు. కరీంనగర్ లో స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజా సమస్యల పరిష్కారానికి హార్ ఘర్ రోజ్ గార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు. ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించి స్వాతంత్ర దినోత్సవం రోజున కరీంనగర్ ప్రజలు జెండా ఆవిష్కరణతో పాటు నీ ఫోటోకు పాలాభిషేకం చేయించుకునేలా చూడాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఐదు లక్షల 50 వేల హౌస్ హోల్డ్స్ కు లబ్ధి చేకూర్చేలా చూడాలని డిమాండ్ చేశారు. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు మాని ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు.

దేశ సమైక్యత, సమగ్రత, దేశభక్తి పెంపొందించడం కోసం ప్రతి ఒక్కరూ జెండా ఎగురవేయడం తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ మహనీయులను స్మరించుకోవడం, ప్రతి ఇంటా జెండా ఎగరవేయడం మన లక్ష్యమని పేర్కొన్నారు. పక్కా లోకల్.. డబుల్ పక్కా లోకల్ అంటూ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టిన కరీంనగర్ జన్మభూమి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. కరీంనగర్ లో ప్రజా సమస్యలు తెలుసుకున్నారా.. ఇబ్బందులు తెలుసుకున్నారా.. తెలుసుకుంటే.. ఏ మేరకు సమస్యలు పరిష్కరించారు.. ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజల ఆశలు వమ్ము చేయవద్దని, వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు పోవాలని సూచించారు. మొదటిసారి ఎంపీగా గెలిచి కరీంనగర్ కు ఏమి చేయలేకపోయారు, రెండోసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారని పేర్కొన్నారు. కనీసం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ముందుకెళ్లాలని బండి సంజయ్ కు సూచించారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్నందున బండి సంజయ్ కుమార్ కరీంనగర్ కు పేరు తీసుకువచ్చే విధంగా మెలగాలని పేర్కొన్నారు. సంచలనాల కోసం కాంగ్రెస్ ను విమర్శించడం పనిగా పెట్టుకోవద్దని సూచించారు. మీకు దమ్ముంటే తెలంగాణ అభివృద్ధి, కరీంనగర్ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. చిల్లరగా మాట్లాడుతూ ప్రజల్లో చులకన కావద్దని, ప్రజల మెప్పు పొందేలా అభివృద్ధి చేసి చూపించాలని వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement