కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా అధికారులు పాల్గొనకపోవడంపట్ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది రాజకీయ కార్యక్రమం కాదే… ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే కదా. ఆర్డీవో మినహా ఇతర అధికారులెవరూ ఎందుకు రాలేదు? మిమ్ముల్నెవరైనా బెదిరించారా?’’అంటూ ప్రశ్నించారు. ఎవరొచ్చినా రాకపోయినా కేంద్ర ప్రభుత్వ అభివ్రుద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్’’ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా రూ.25 వేల కోట్లతో 508 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ పనులను వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా 26 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు కరీంనగర్ ఆర్డీవో మహేశ్, దక్షిణ మధ్య రైల్వే అధికారులు క్రిష్ణారెడ్డి, కౌశల్ పాండే, స్థానిక కార్పొరేటర్లు కె.శ్రీనివాస్, జితేందర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్పొరేటర్లు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే లేన్ల ఏర్పాటు, కొత్త ఆర్వోబీ నిర్మాణం కోసం బండి సంజయ్ చేసిన కృషిని కొనియాడారు. సంజయ్ వల్లే కరీంనగర్ అభివృద్ధి జరుగుతోందన్నారు.