ఐక్యతతోనే బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం సాధ్యమని కాంగ్రెస్ ఓబీసీ, ఎంబీసీ సెల్ జాతీయ కన్వీనర్ వి.హన్మంతరావు పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ… జనాభాలో 85శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంతకాలం రాజ్యాధికారానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీలే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నారని, బడుగు బలహీన వర్గలంతా ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా రాజ్యాధికార లక్ష్యం నెరవేరుతుందని జోస్యం చెప్పారు. మెజార్టీ ప్రజల ఓట్లను దండుకొని ఓసీలే పరిపాలన కొనసాగిస్తూ బడుగు బలహీనవర్గాలను అణగదొక్కుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బడుగు బలహీనవర్గాలు కలిసి రావాలని, రాజ్యాధికారం సాధించే వరకు అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
కేంద్రంలో 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోడీ విభజన చట్టం హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్‌లో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించక పోవడం అన్యాయమన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. రాజ్యాంగాన్ని ముట్టుకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించేలా సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు సి. సత్యనారాయణరెడ్డి, గంట రాములు, వేముల రామ్మూర్తి, బొంకూరి అవినాష్, దొడ్డుపల్లి జగదీశ్, పూదరి చంద్రశేఖర్, రవూఫ్, రంగు శ్రీనివాస్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..