పెద్దపల్లి : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధులకు అవగాహన పెంచాలని పెద్దపల్లి డీసీపీ రూపేశ్ పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ట్రినిటి ఇంటర్మీడియల్ కాలేజీ విద్యార్థులకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రూల్స్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, షీ టీమ్స్, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు, యువత సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఇంటర్నెట్ వాడడం ఎక్కువైందని, అపరిమితంగా వాడుతున్న వారే ఎక్కువగా సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారన్నారు. ఇలాంటి వారంతా సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మిత్రులకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు సైబర్ క్రైమ్ బారిన పడకుండా అవగాహన కల్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా విద్యార్ధినిలు, మహిళలు తమ వివరాలను గోప్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లాటరీ వచ్చిందని, కూపన్స్ వచ్చాయని ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
అనవసర లింకులు షేర్ చేస్తూ, కుటుంబ సభ్యుల ఫోటోలను పెట్టుకొని డబ్బులు అడుగుతూ, ఓఎల్ఎక్స్లో వాహనాలు తీసుకుంటామంటూ, కొనుగోలు చేస్తామంటూ పలు రకాలుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందన్నారు. సైబర్ నేరాలను అదుపు చేయాలంటే పోలీసు ఒకవ్యవస్థతోనే సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైన వెంటనే సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి గాని, సంబంధి వెబ్సైట్కుకాని సంప్రదిస్తే వెంటనే పోగొట్టు-కున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటు-ందని తెలిపారు. అలాగే రోడ్డు భద్రత నిబంధనలపై కూడా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్ఐ రాజేష్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.