ఇసుక వ్యాపారం నుండి తెరాస నాయకులు డబ్బులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపణల పై పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తప్పుడు కూతలు కూయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. దమ్ముంటే తెరాస నాయకులు డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలని, తప్పుడు మనుషులు ఎవరో కక్కుర్తి పరులెవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. లంగ పనులు చేయడం, తప్పుడు కూతలు కూయడం, లంచాలు తీసుకోవడం, కమిషన్లు తీసుకోవడం ఎవరికి అలవాటు ఉందో ప్రజలకు స్పష్టంగా తెలుసని అందుకే రెండుసార్లు ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నిన్ను చీకొట్టారన్నారు.
డబ్బులు తీసుకొని ఎవరు పని చేస్తారో పెద్దపల్లి ప్రజలకు బాగా తెలుసని, తప్పుడు మాటలు మాట్లాడితే తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ట్రాక్టర్ యజమానుల సంఘం డబ్బులు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారని, ఎవరైనా ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చినా తెరాస నాయకులకు డబ్బులు ఇచ్చిన వేదిక ద్వారా బహిరంగంగా తెలియజేయాలన్నారు. తప్పుడు పనులకు పాల్పడినా, డబ్బులు తీసుకున్న శిక్ష తప్పదన్నారు. లంగ తనం, దొంగతనం ఎవరు చేస్తారో ప్రజలకు బాగా తెలుసన్నారు. గత కాలంలో ఏం చేశారో గుర్తు పెట్టుకోవాలని, అవసరమైన సమయంలో తగిన సమాధానం చెబుతామన్నారు. తప్పుడు మాటలు మానుకోకపోతే మరోసారి గుణపాఠం తప్పదు అన్నారు. సభ్యత సంస్కారంతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు.