ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల సత్ప్రవర్తనతో మెదులుతూ నీతి నిజాయితీలకు చిరునామాగా నిలువాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ.సత్యనారాయణ అన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కులమతాలు వేరైనా మనమంతా భారతీయులమే అనే భావంతో మెదులుతూ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఆజాదీ – కా- అమృత్ మహోత్సవంలో భాగంగా శనివారం కరీంనగర్ లో ఆటో డ్రైవర్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీని నిర్వహించారు. కమిషనరేట్ కేంద్రం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని పోలీస్ కమిషనర్ వీ.సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పారు. జాతీయ జెండాతో నిర్వహించే కార్యక్రమాల్లో నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్లకు పోలీస్ శాఖ తరపున సహకారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లందరూ యూనిఫారం లను ధరించి రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. కమిషనరేట్ కేంద్రం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ – వన్ టౌన్ – కమాన్ ల మీదుగా తిరిగి ప్రతిమ మల్టీప్లెక్స్ – గీతా భవన్ – ఐబీ గెస్ట్ హౌస్ – కోర్టు చౌరస్తా ల మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ విజయ్ కుమార్, ఇన్ స్పెక్టర్ తిరుమల్, నాగార్జున రావు, రిజర్వ్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement