పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించి వారి విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు పాఠశాలలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం స్వీకరించాలని, ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా నేర్చుకోవాలని, బాగా చదువుకుంటే మన ఆశయాలు నెరవేరుతాయని కలెక్టర్ తెలిపారు.
ప్రాథమిక పాఠశాల ఆవరణలో న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేయాలని, సదరు న్యూట్రి గార్డెన్ లో పెంచిన తాజా కూరగాయలతో విద్యార్థులకు ఆహారాన్ని అందించే విధంగా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం అదే ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్తులు పాల్గోన్నారు.