ఆల్బెండజోల్ మాత్రలు తీసుకొని నులిపురుగుల నుండి రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంను పురస్కరించుకొని గురువారం రంగంపల్లిలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకులంలో నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డితో కలిసి పాల్గొని మందుల పంపిణీని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని 1 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న 2,19, 500 మంది పిల్లలకు నులి పురుగుల నివారణ మందులు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నులిపురుగుల నివారణ కోసం జిల్లాలో బఫర్ స్టాక్ తో కలిపి మొత్తం 2,27,300 ఆల్బెండజోల్ మాత్రలు సిద్ధం చేశామన్నారు. పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకొని నులిపురుగుల బారి నుండి రక్షణ పొంది ఎనిమియా తదితర జబ్బులు రాకుండా మానసిక, శారీరకంగా ఆరొగ్యంగా ఉంటూ అన్ని రంగాలలో అభివృద్ది సాధించాలన్నారు.
వ్యక్తిగత పారిశుద్యం పట్ల జాగ్రత్త వహించాలని, అంటు వ్యాధులను నివారిస్తు భవితవ్యానికి నాంది పలకాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరొగ్య, అంగన్ వాడి కేంద్రాలలో, ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలో, జూనియర్ కళాశాలలో, సాంకేతిక కళాశాలలో మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. నేడు నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోని విద్యార్థులకు ఆగస్టు 10న మరోమారు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, చిన్న వయసు నుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలని, ఆరోగ్యవంతమైన అలవాట్లు, నడవడికతో మంచి విజయాలు సాధించగలుగుతామన్నారు.
పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ… నులిపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరూ సద్వినియోగం చేసుకోవాలని, తప్పనిసరిగా 19 సంవత్సారాలలోపు వయస్సు కల్గిన ప్రతి ఒక్కరూ నివారణ మందులు వేసుకోవాలన్నారు. ఈ రోజు మిస్సైన వారి కోసం ఆగస్టు 10న మరోమారు నిర్వహించడం జరుగుతుందన్నారు. నులిపురుగుల నివారణ మందులు తీసుకోవడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మనం మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్, రాఘవపూర్ మెడికల్ అధికారిని లావణ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.