Friday, November 22, 2024

Peddapalli: ఆర్‌ఓఆర్‌ ముసాయిదా బిల్లుపై సలహాలివ్వండి.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆగస్టు 22 (ప్రభన్యూస్‌): భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు జే.అరుణ శ్రీ, జీవీ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌, డీసీపీ ఎం.చేతనతో కలిసి రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయ వాదులు నిపుణులతో నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం ముసాయిదా బిల్లుపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం- 2024 ముసాయిదా బిల్లులో పేర్కొన్న అంశాలు, ఈ బిల్లు తీసుకురావడంలో గల ఉద్దేశం అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌ వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ… భూ సమస్యల పరిష్కారం కోసం నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమమైన భూ రికార్డుల నిర్వహణను పరిశీలించిన నిపుణుల బృందం నూతన ఆర్‌ఓఆర్‌ 2024 ముసాయిదా బిల్లును రూపొందించిందన్నారు. నూతన చట్టం రూపకల్పనలో విస్తృతంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భూ రికార్డుల నిర్వహణకు మెరుగ్గా ఉండేలా ముసాయిదా బిల్లుపై రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు (రి-టైర్డ్‌, సర్వీస్‌) తమ సూచనలను అందజేయాలని కలెక్టర్‌ కోరారు. నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే రాతపూర్వకంగా 2, 3 రోజుల్లో కలెక్టరేట్‌ కార్యాలయానికి అందిస్తే, వాటిని ఒక నివేదిక రూపంలో సిద్ధం చేసి తుది చట్ట రూపకల్పన కోసం సీసీఎల్‌ఏకు అందజేస్తామన్నారు.

చర్చలో పాల్గొన్న రి-టైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగులు సుదర్శన్‌, శంకరయ్య, న్యాయవాదులు శశి భూషణ్‌ సాయిల్‌ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షులు బొంకూరి శంకర్‌ తమ సూచనలు, సలహాలు తెలిపారు. గ్రామంలోని ఆబాది భూముల రికార్డులు అప్డేట్‌ చేయాలని, సాధా బైనమా భూముల రిజిస్ట్రేషన్‌ రుసుం వసూలు చేయాలని, పోజిషన్‌ కాలం ఉండాలని, అప్పిలేట్‌ అథారిటీ ఆర్డీఓ స్థాయిలో ఉండాలన్నారు. పెద్దపల్లి తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం ముసాయిదా బిల్లుపై పలు సూచనలు చేశారు. 1971లో ఆర్‌ఓఆర్‌ చట్టం తెస్తే 1989లో రూల్స్‌ అందించారని, 2020 ఆర్‌ఓఆర్‌ చట్టానికి ఇప్పటివరకు రూల్స్‌ తయారు చేయలేదని, నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం 2024 అమలు చేసిన నెలరోజుల లోపల రూల్స్‌ రూపొందించాలని తెలిపారు. నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం అమలు కోసం ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చర్యలు తీసుకొవాలని, భూ సమస్యల అప్పిలేట్‌ అథారిటీ- జిల్లా స్థాయిలోనే ఉండేలా చూడాలని తెలిపారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ డివిజన్‌ అధికారులు బి.గంగయ్య, వి.హనుమా నాయక్‌, తహసీల్దార్‌ లు, నిపుణులు, న్యాయవాదులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement