జగిత్యాల : ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ ఛాలిసా పారాయణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత కొండగట్టులో ఆంజనేయస్వామి దేవాలయంలో రామకోటి స్తూపానికి భూమిపూజ చేశారు. దాదాపు రూ. 90 లక్షల వ్యయంతో 23 అడుగుల ఎత్తున రామకోటి స్తూపం నిర్మించనున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. హనుమాన్ దీక్షలు ప్రారంభమయ్యే మార్చి 17 నుంచి ప్రతి రోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో హనుమాన్ ఛాలిసా పారాయణం కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రతి రోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో పదకొండు సార్లు హనుమాన్ ఛాలిసా పారాయణం చేయడంతో పాటు, కొండగట్టులో జరిగే పారాయణం వివిధ మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ.. ఎవరింట్లో వాళ్లు పారాయణం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొండగట్టు దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని వెల్లడించారు. కోరిన వెంటనే రామకోటి స్తూపాన్ని మంజూరు చేయడం సంతోషదాయకమన్నారు .కొండగట్టు అంజన్న దేవాలయంలో ప్రస్తుతం దాదాపు ఐదు కోట్ల రామకోటిలు రాసి ఉన్నాయని, వచ్చే 80 రోజుల్లో భక్తులందరూ మరో ఆరు కోట్ల రామ కోటిలు రాయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. దీని ద్వారా జూన్ 4వ తేదీన హనుమాన్ జయంతి రోజున పదకొండు కోట్ల రామకోటిలతో స్తూప ప్రారంభోత్సవం చేసుకునే వీలుంటుందన్నారు. హనుమంతుడి నామస్మరణతో కరోనాను పారద్రోలి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు కవిత తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్సీ సంజయ్ కుమార్, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement