Tuesday, November 26, 2024

“మహా” జాతరకు అధికారులందరూ సర్వ సన్నద్ధం కావాలి – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతర విజయవంతానికి కృషి చేయాలి
జాతరకు వచ్చే ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి
కోవిడ్ దృష్ట్యా ధర్మగుండంలో స్నానాలకు అనుమతి లేదు
భక్తుల సౌకర్యార్థం స్నానాలు చేయడానికి తాత్కాలిక షవర్ల ఏర్పాటు
అందుబాటులో హెలికాప్టర్ సేవలు
ప్రైవేటు లాడ్జీలలో ధరల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలి
పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి – రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

వేముల‌వాడ – దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర పుణ్యక్షేత్రంలో రేపటి నుండి మూడు రోజుల పాటు జరగనున్న మహా శివరాత్రి జాతర నిర్వహణకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులందరూ సర్వ సన్నద్ధం కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేములవాడ దేవస్థానంలోని అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి మహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, ఆదేశాలు మంత్రి జారీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహా శివరాత్రి జాతర అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులందరూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతర విజయవంతానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని కోరారు. కోవిడ్ దృష్ట్యా ఈ సంవత్సరం ఆలయంలోని ధర్మగుండంలో స్నానాలకు అనుమతి లేదు అని మంత్రి స్పష్టం చేశారు. శివార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడుతాయని అన్నారుం. భక్తుల సౌకర్యార్థం స్నానాల కోసం ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక షవర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో నిమగ్నమై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
జాతర నిర్వహించే మూడు రోజులపాటు ఒక్కో రోజుకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ దిశగా అధికారులు అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రి ఆదేశించారు. త్రాగు నీటి సదుపాయం కల్పించాలని అన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఆలయ పరిసరాలలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.
జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధులు ప్రబలకుండా ఆలయ పరిసరాలలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్ప్రే చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. మూడు రోజులపాటు విద్యుత్ సరఫరా లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రి అన్నారు.
గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. పట్టణంలోని ప్రైవేటు లాడ్జ్ లలో గదుల ధరలు పెంచకుండా పోలీస్, మున్సిపల్ అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భక్తుల సౌకర్యార్థం వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచాలని మంత్రి అన్నారు. అంబులెన్స్ లు కూడా అందుబాటులో ఉంచుకోవాలని, మూడు షిఫ్టుల్లో వైద్య సిబ్బంది సేవలందించేలా చూడాలని ఆదేశించారు.
పోలీస్ బందోబస్తు పటిష్టంగా చేపట్టాలని మంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అన్నారు. రెస్క్యూ టీమ్ కూడా అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ జాతర నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల కోసం యంత్రాంగం తరపున 90 వేల మాస్కులను, సానిటైజర్లను అందుబాటులో ఉంచామని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. 25 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రచారం కల్పిస్తున్నామని అన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జాతర నేపథ్యంలో 2 వేల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 500 సీసీ కెమెరాల పర్యవేక్షణలో జాతర నిర్వహించబడుతుందని అన్నారు. ప్రత్యేక పోలీస్ హెల్ప్ డెస్క్ కూడా ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు బారికేడ్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ బి.సత్య ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్, ఆర్డీఓ శ్రీ శ్రీనివాస రావు, ఈఓ శ్రీ కృష్ణ ప్రసాద్, మున్సిపల్ కమీషనర్ శ్రీ శ్యామ్ సుందర్ రావు, తహసీల్దార్ శ్రీ మునేందర్, తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, శాలువాతో మంత్రిని ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement