కరీంనగర్ : ఎన్ని వందల కోట్ల రూపాయాలైనా ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను కరోనా నుంచి కాపాడుకుంటాం అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని తేల్చిచెప్పారు. కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. జెడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ల విజయతో కలిసి ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. కల్యాణం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా రాష్ర్ట వ్యాప్తంగా సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు నిరాడంబరంగా కొనసాగాయన్నారు. వచ్చే కల్యాణోత్సవం అయినా కోట్లాది మంది సమక్షంలో జరగాలని ప్రార్థించానని తెలిపారు. కరోనా అంతం కావాలని కోరుకున్నానని వెల్లడించారు. పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించానని చెప్పారు. కరోనా కష్ట కాలంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ పారద్రోలాలని కోరారు. ప్రభుత్వానికి తోడుగా నిలవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. సెకండ్ వేవ్‌లో గత వారం పదిరోజులుగా కేసులు అధికమవుతున్నాయని అంటూ. పాజిటివ్ కేసులు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఆక్సిజన్, బెడ్ల కొరత లేకుండా ప్రజానీకాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకోసం తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు.. అలాగే ము ఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని శ్రీరామ చంద్రుడిని ప్రార్థించినట్లు మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement