Tuesday, November 26, 2024

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

గోదావరిఖని: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. రామగుండం కమీషనరేట్‌ కార్యాలయ ఆవరణలో రౌడీషీటర్లకు ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌ సమావేశంలో సీపీ మాట్లాడారు. రౌడీ షీటర్లపై నిరంతరం పోలీసుల నిఘా కొనసాగుతుందన్నారు. సెటిల్మెంట్లు-, అల్లర్లకు పాల్పడినా, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినా, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటివరకు 380 మందిపై రౌడీషీట్‌ ఉందని, ఎలాంటి గొడవలు సృష్టించినా, ప్రజల స్వేచ్ఛకు భంగం కల్గించిన, శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసినా ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, ప్రజలను భయాందోళనకు గురిచేసేలా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. అలాగే కమిషనరేట్‌ పరిధిలోని సుల్తానాబాద్‌, పెద్దపల్లి, గోదావరిఖని, ఎన్టీపీసీ, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో భూ మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పేదలను మోసం చేసేలా బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తే తమకు తెలపాలని, వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఈసమావేశంలో డిసిపి రవీందర్‌, ఎసిపి ఉమెందర్‌, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ అశోక్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement