సానుకూల దృక్పథంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం హల్ లో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ లతో కలిసి ప్రజాపాలన గ్రామ,వార్డు సదస్సుల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు ప్రారంభిస్తామని, అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు, రాష్ట్రంలోని కుటుంబాల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో ప్రజా పాలన సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు.
మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు.ప్రతి గ్రామానికి దరఖాస్తులు ఒకరోజు ముందుగానే వస్తాయని, గ్రామ ప్రజలకు ముందుగానే దరఖాస్తులు అందించాలని, దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలోని నిరక్షరాస్యులకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు దరఖాస్తు నింపడంలో సహకరించేలా చూడాలని అన్నారు.
గ్రామంలో నిర్వహించే ప్రజాపాలన సదస్సు ముగిసిన తరువాత కూడా ప్రజలు పంచాయతీ కార్యాలయంలో జనవరి 6 వరకు తమ దరఖాస్తు సమర్పించే అవకాశం ఉందని, దీని మేరకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు మార్గదర్శకాలు జారీ చేయాలని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరించే సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు జత చేయాలని, రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తులు స్వీకరించాలని ప్రస్తుతం సేకరించిన దరఖాస్తుల పరిశీలించి, నూతన రేషన్ కార్డుల జారీ పై భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ పాలనలో మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని, మార్పు కావాలని ఆకాంక్షించిన వారిలో ప్రభుత్వ ఉద్యోగుల సైతం అధిక సంఖ్యలో ఉన్నారని, ప్రజలు ఆకర్షించిన మార్పును వారికి అందించే దిశగా, పేదవాడి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
రాష్ట్ర రవాణా, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ* నూతన ప్రభుత్వం ఏర్పడిన 2 రోజులలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని , ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేసే కార్యాచరణ ప్రభుత్వం ప్రారంభించిందని, అర్హులందరికీ పథకాలు వర్తింప చేసేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు..