ప్రభన్యూస్,హైదరాబాద్: చిన్నారిని దత్తత తీసుకోలేదని సినీ నటి కరాటే కల్యాణి అన్నారు. దత్తత వ్యవహారంపై మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ శర్మన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులు అందుబాటులో లేకపోవడంతో బుధవారం మరోమారు విచారణకు రమ్మన్నారని కరాటే కల్యాణి తెలిపారు. ఇటీవల కరాటే కల్యాణి దత్తత వ్యవహార హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జిల్లా వెల్ఫేర్ అధికారి అక్కేశ్వర రావు ఆధ్వర్యంలో కరాటే కల్యాణి వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కలెక్టరేట్‌కు వచ్చి..కలెక్టర్ శర్మన్ కలిసి తన వర్షన్‌ను చెప్పుకున్నారని జిల్లా వెల్ఫేర్ అధికారి అక్కేశ్వరరావు మంగళవారం ప్రభన్యూస్‌తో చెప్పారు.
అమీర్‌పేటలోని చిల్డ్రన్స్ హోమ్‌లో బుధవారం మరోమారు సీడబ్ల్యూసీ విచారణకు హాజరై కరాటే కల్యాణి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశామని ఆయన చెప్పారు. అయితే పాపను దత్తత తీసుకున్నట్లు శివశక్తి సంస్థ కావాలనే ప్రచారం చేసిందని కరాటే కల్యాణి మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. తాను దత్తత తీసుకున్నట్లు ఒక మీడియా సంస్థతో మాట్లాడింది నిజమే అని, అయితే తనను చూసి ఇన్‌స్పైర్ అవుతారనే అలా చెప్పానని ఆమె వెల్లడించడం గమనార్హం. కావాలనే తనను కొన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని కూడా ఈ సందర్భంగా కరాటే కల్యాణి వాపోయారు.