హైదరాబాద్, ఆంధ్రప్రభ : సంక్రాంతి రోజుల్లో కనుమ నాడు మాంసహారం తీసుకోవడం ఆనవాయితీ. భోగి, సంకాంత్రిని సందడిగా జరుపుకున్న ప్రజలు బుధవారం కనుమ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. కనుమ పండగ రోజు మాంస హారం కోసం మార్కెట్‌కు మాంస ప్రియులు పరుగులు తీశారు. దీంతో చికెన్, మటన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తెల్లవారుజాము నుంచే చికెన్, మటన్ షాపుల వద్ద బారులు తీరారు. అలాగే చేపల మార్కెట్ కూడా కిటకిటలాడుతున్నాయి. కనుమ సందర్భంగా నాటు కోడి మాంసంతోపాటు మటన్‌కు మంచి డిమాండ్ ఉంది. మటన్ కిలో ధర వెయ్యి రూపాయలకు చేరుకుంది.
నాటు కోళ్లకు ఫుల్ గిరాకీ
ప్రధానంగా నాటు కోళ్లను కొనుగోళ్లు చేసేందుకు మాంస ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. కిలో రూ. 900 చెబుతున్నా కొనుగోళ్లు చేస్తున్నారు. మరోవైపు లైవ్ నాటు కోళ్లను కూడా అమ్ముతున్నారు. బాయిలర్ కోళ్ల మాంసాన్ని కేజీని రూ. 300 వరకూ ధర పలుకుతుంది. అయినా వెనక్కి తగ్గేది లేదని కొనుగోలు చేస్తున్నారు. నాటు కోళ్లు భారీగా అమ్ముడు పోతున్నాయి.
చేపల మార్కెట్లు కిటకిట
మాంస ప్రియులు చేపలు కొనుగోళ్లుకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. నిత్యం రూ.150 కిలో చేపలు ప్రస్తుతం రూ. 200ల ధరకు చేరుకుంది. ఒకేసారి ధరలు పెరిగినా కొనుగోళ్లుకు ఎవరూ తగ్గడం లేదు. ఇక కొరమీన, సముద్రం చందువలు ధరలు ఆకాశానికి తాకాయి. చందువులయితే కిలో వెయ్యి రూపాయలు పలుకుతుంది. కొరమీన అయితే కిలో నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ధర పలుకుతుంది.