… వాహనాల కొనుగోలు వ్యవహారంలో చేతివాటం
… నిజామాబాద్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ
… ఎస్సైలకు కలిసిరాని లింగంపేట్ పోలీస్ స్టేషన్
నిజామాబాద్ క్రైం, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ ఏసిబి కి పట్టుబడ్డారు. నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్ వద్ద రూ.12,500 నగదు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవలే లింగంపేట ఎస్సై స్టేషన్ బెయిల్ వ్యవహారంలో పట్టుబడగా, కొద్ది నెలల్లోనే మరో ఎస్సై ఏసీబీకి చిక్కారు.
బాధితుడు చెప్పిన ప్రకారం వివరాల్లోకి వెళితే…. లింగం పెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మరి కొండేష్ తన కారును నవీన్ గౌడ్ కు కొద్దిరోజుల క్రితం అమ్మారు. నవీన్ గౌడ్ నుంచి స్వామి కొనుగోలు చేశారు. నాగారంకు చెందిన చిరంజీవికి స్వామి అదే కారును అమ్మేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ లో కారుపై లోన్ వుంది. చిరంజీవి నెలవారి కిస్తులు కట్టకపోవడంతో కమ్మరి కొండేష్ పేరు పైన ఉన్న కారు ను స్వాధీన చేసుకోవడానికి ఫైనాన్స్ కంపెనీ వచ్చింది. దీనితో కొండేష్ స్థానిక లింగంపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఎస్ఐ సుధాకర్ ఫోన్ చేసి స్వామిని లింగ పేట పోలీస్ స్టేషన్ కు పిలిపించి 6 గంటల పాటు లాకప్ లో వేశారు. కేసు నుంచి తప్పించాలంటే 20 వేల రూపాయలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశారు. అంతగా ఇచ్చుకోలేని ప్రాధేయపడడంతో చివరికి రూ.12వేల 500 లకు ఒప్పంద కుదిరింది. అయితే డబ్బులు ఇవ్వాలని ఫోన్ చేయడంతో నిజామాబాద్ లో ఉన్నానని స్వామి చెప్పారు. తాను నిజామాబాద్ కి వస్తున్నానని చెప్పిన ఎస్ఐ ని పట్టించేందుకు స్వామి ఏసీబీని ఆశ్రయించారు.
బుధవారం రోజున మధ్యాహ్నం స్వామికి ఫోన్ చేసిన ఎస్ఐ సుధాకర్ హనుమాన్ జంక్షన్ వద్దకు రావాలని చెప్పాడు. దీంతో పథకం ప్రకారమే ఏసీబీతో పాటు చేరుకొని స్వామి డబ్బులు ఇచ్చాడు. వెంటనే రెడ్ హ్యాండెడ్ గా ఎస్సైనీ పట్టుకున్నారు. ఏసీబి కి పట్టుపడ్డ ఎస్సై సుధాకర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.