కమలాపూర్ ప్రభ న్యూస్ – మద్యం మత్తులో ఆటో నడిపితే.. నిండు ప్రాణం బలైపోయింది. హోలీ పండుగ స్నేహితులతో కలిసి చేసుకోవాలనుకున్న కలలు కలగానే మిగిలిపోయాయి. కన్నవాళ్ళకు కడుపు కోతను మిగిల్చి,పండగ పూట ఆ కుటుంబాలలో విషాదం మిగిల్చాయి. హోలీ పండుగ పర్వదినాన ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురు స్నేహితులు కలిసి మద్యం సేవించి గ్రామానికి తిరుగు ప్రయాణంలో ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గోపాలపూర్ (బత్తివానిపల్లి) గ్రామంలో మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నడికూడా మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మృతుడు శనిగరపు వంశీ, ఆటో డ్రైవర్ గంగారపు వినయ్, బొల్లం ప్రశాంత్, శనిగరపు సాయిలు కలిసి సోమవారం శనిగరం గ్రామానికి మధ్యాహ్నం ఆటోలో చేరుకున్నారు. శనిగరం వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేసి మద్యం తాగారు. మధ్యాహ్నం రెండున్నర సమయంలో తిరిగి స్వగ్రామమైన చర్లపల్లి గ్రామానికి వెళుతుండగా గోపాలపూర్ గ్రామ శివారులో ఆటో డ్రైవర్ వినయ్ ఆటోను అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడపడంతో ఆటో బోల్తా కొట్టింది. ఆటో బోల్తా కొట్టడంతో శనిగరపు వంశీ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రశాంత్, సాయి, ఆటో డ్రైవర్ గంగారపు వినయ్ లు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఎంజీఎం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కమలాపూర్ సిఐ హరికృష్ణ పోలీస్ సిబ్బంది లు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని మృతున్ని శవ పరీక్ష నిమిత్తం ఎంజిఎంకు తరలించారు. కాగా సిఐ హరికృష్ణ మాట్లాడుతూ.. మద్యం తాగి అజాగ్రత్తగా ఆటో నడపడంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రాధమిక నిర్ధారణ చేశారు. కాగా ఈ ఘటనతో చర్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.చెట్టంత కొడుకు పండగపూట మరణించిన వార్తను విని కుటుంబం కన్నీరు మున్నిరుగా విలపించింది.