Friday, November 22, 2024

కల్వకుంట్ల రాజ్యాంగం : అసెంబ్లీ సాక్షిగా అర్థ‌మైంద‌న్న బండి సంజ‌య్

ఈరోజు శాసనసభలో జరిగిన సంఘటనలు చూస్తే… తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందనే విషయం అసెంబ్లీ సాక్షిగా మరోసారి స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ….‘ట్రిపుల్ ఆర్’ సినిమా ఇంకా రిలీజ్ కాలే. ట్రైలర్ చూసే సీఎం కేసీఆర్ కు వణుకు పుడుతోందన్నారు. సినిమా రిలీజ్ అయితే ఆయన గుండె ఆగిపోతదేమో..అన్నారు. అసలు బీజేపీ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేసిండ్రో ఎవరికి అర్ధం కాలేదని, అసలు వాళ్లు చేసిన తప్పేంది ? అని అడిగారు. ప్రజాస్వామ్యబద్దంగా సభను కొనసాగించాలి…. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరడమే బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పా? అన్నారు. వాళ్లు సభను కూడా అడ్డుకోలేదు. సభలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదే. అయినా సస్పెండ్ చేయడమేంది ? ఇదంతా కేసీఆర్ ప్రీ ప్లాన్.. ముందే రాసుకున్న స్ర్కిప్ట్ ను అమలు చేసిండు. ఇంతకంటే మూర్ఖత్వం, పిరికితనం ఇంకోటి కాదన్నారు. చివరకు మా ఎమ్మెల్యేలు సస్పెండ్ ను నిరసిస్తూ ప్రజాస్వామ్యబద్దంగా అసెంబ్లీ ఆవరణలో ధర్నా చేస్తే కూడా సహించలేక అరెస్టు చేసిండ్రు అన్నారు. సభలో బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తే.. సీఎం సైగలు చేయగానే ఒక మంత్రి పోయి కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతున్నార‌న్నారు.

తెలంగాణ ఉద్యమకారులు సభలోకొస్తే బండారం బయటపడుతుందేమోననే భయంతోనే ఇదంతా చేస్తున్నరన్నారు. రాష్ట్రానికి నువ్వు ఒరగబెట్టిందేమీ లేదు కాబట్టే గవర్నర్ ప్రసంగం కూడా లేకుండా చేసిన నీచమైన చరిత్ర టీఆర్ఎస్ దేన‌న్నారు.గత శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గిట్లనే ప్రశ్న అడగాలని చెయ్యి ఎత్తితే.. కేసీఆర్ సస్పెండ్ చేసిండు. ఆనాడు ఖండించిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇప్పుడేం మాట్లాడరెందుకు? సమాధానం చెప్పాలన్నారు. విలేకరులు అడిగిన పశ్నకు… గతంలో శాసనసభలో టీఆర్ఎస్ చేసిన అరాచకాలు తెల్వదా ? వీళ్లలాగా చేసుంటే సభలో ఎవరూ మిగలకపోయేవాళ్లు. గతంలో సభలో సమస్యలపై రోజుల తరబడి ధర్నాలు, నిరసనలు, గొడవలు చేసిన దాఖలాలున్నయ్. మీలాగా వ్యవహరించారా ? పోనీ గతంలో మాదిరిగా కూడా బీజేపీ సభ్యులు వ్యవహరించలేదే. క్రమశిక్షణతో ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించారు. అయినా సస్పెండ్ చేస్తారా ? అన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ ఉన్నంత వరకు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయనీయమ‌న్నారు. నీ అరాచకాలను అడ్డుకుని తీరతామ‌న్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సంగప్ప తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement