Saturday, November 23, 2024

Kalvakuntla Kavitha – తెలంగాణ‌లో సాగునీటి ఘోష తీర్చిన అపర భ‌గీర‌థుడు కెసిఆర్

నిజామాబాద్ – దేశాన్ని 50 ఏళ్ల పాటు, ఉమ్మడి రాష్ర్టాన్ని ఓ దశాబ్దం పాటు పాలించిన కాంగ్రెస్​ పార్టీ రాష్ర్టానికి సాగు, తాగు నీటిని అందించలేకపోయిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ నిజామాబాద్​లో జరిగిన సాగునీటి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవిత హాజరయ్యారు.. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్​ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతోనే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్​ తాను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరని, కాంగ్రెస్​ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటో ఆ పార్టీ నాయకులు చెప్పాలన్నారు. బీఆర్ఎస్​ పాలనలో సాగు, తాగుకు నీరు పుష్కలంగా అందిస్తున్నామని చెప్పారు. సమైక్యపాలనలో జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.

కేసీఆర్​ అంటే అందరూ కల్వకుంట్ల చంద్రశేఖర్​అనేవారని ఇప్పుడు కాళేశ్వరం చంద్రశేఖర్​ అంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట్​గా కాళేశ్వరం ఘనతకెక్కిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసినా ప్రాజెక్టుకి నిధులు, జాతీయ హోదా ఇవ్వక పోవడం సిగ్గు చేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ పాలనలో కాలువలు తవ్వి రూ.వేల కోట్లు దోచుకునే వారని అలాంటి వ్యక్తులు కాళేశ్వరంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణ‌లోని బీడు భూముల‌ను మ‌గాణిలుగా మార్చిన రైతు బాంధ‌వుడు కెసిఆర్ అంటూ కీర్తించారు.. ఒక్క కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ సాగునీటి ఘోష తీర్చిన భ‌గీర‌థుడంటూ క‌విత ప్ర‌శంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement