హైదరాబాద్ – అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, అయితే ఇంతవరకు దానిపై వారు నోరు మెదపడం లేదన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్. నొక్కిన డబ్బును కక్కిస్తామని, అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని మాటలు ఏమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌ను ప్రశ్నించారు.
సావిత్రిబాయి పూలే జయంతి సందర్బంగా తెలంగాణ బీజేపీ స్టేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సీబీఐ విచారణ చేయిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ వేరు కాదని ఇప్పుడు నిరూపితం అవుతుందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆ పార్టీలు కలుస్తాయని బీజేపీ ముందే చెప్పిందని అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీలు కలిసి పని చేస్తాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ జ్యోస్యం చెప్పారు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, సావిత్రి భాయి పూలే ఆశయాలను మోడీ కొనసాగిస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో మహిళలకు పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. మహిళ స్వయం శక్తి బృందాలకు చేయూతనిస్తున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం మహిళ సాధికారతకు కృషి చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం త్రిబుల్ తలాక్ ను రద్దు చేశామని అంటూ, చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్ లు కల్పించామని లక్ష్మణ్ పేర్కొన్నారు.