Friday, November 22, 2024

TS: కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి… త‌మ్మినేని

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎంను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా రేవంత్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక విన్నపం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించవద్దని తమ్మినేని కోరారు. ఈ మేరకు ఆయన రేవంత్ కు లేఖ రాశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలు కేంద్రం చేతిలో పావులా మారాయని లేఖలో తమ్మినేని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. సమావేశాల సందర్భంగా పలు రంగాలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం… గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. విద్యుత్ రంగంలో మూడు అంశాలపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్టు శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తును సీబీఐకి అప్పగించకుండా… సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపిస్తే మేలని సూచించారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కొన్ని గణాంకాలను కూడా లేఖలో ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ. 93 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఇందులో బ్యాంకుల ద్వారా రూ. 87,449 కోట్లు మంజూరు కాగా… రూ. 71,565.69 కోట్లు విడుదలయ్యాయని, ఈ మొత్తాన్ని ఖర్చు చేసేశారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement