కాళేశ్వరం ప్రాజెక్ట్ భారీ నష్టానికి కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు జీరో విద్యుత్ బిల్లును మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… అధికారంలో ఉండగా ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ రక్షణ, మరమ్మత్తుల కోసం చర్యలు చేపట్టలేదో కేటీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. నాడు ప్రాజెక్టు రక్షణ విస్మరించి, నేడు రాజకీయంగా మన ప్రభుత్వంపై బురదజల్లేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెళ్లడాన్ని ప్రజల గమనిస్తున్నారన్నారు.
ప్రాజెక్ట్ సందర్శనలో కనీసం భూ నిర్వాసితుల సమస్యలపై మాట్లాడకపోవడం విచారకరమన్నారు. భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించలేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ దెబ్బతిన్న తీరుపై రక్షణ చర్యల నిమిత్తం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నిపుణులైన ఇంజనీర్ల సూచనలతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, భారీ నీతిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ప్రకటించారన్నారు. విడుతల వారీగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు.