తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లా పరిధిలోని అన్ని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 8,470 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 7,223 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 3.26 టీఎంసీలుగా ఉంది.
మరోవైపు జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 1,05,281 టీఎంసీలుగా ఉండగా, ఔట్ ఫ్లో 1,07,036 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం 317.60 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి అధికంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా…ప్రస్తుత నీటిమట్టం 587.50 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 17,062 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 16,372 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 305.8030 టీఎంసీలుగా కొనసాగుతోంది.