ముథోల్ – టిఆర్ఎస్ అసమ్మతి వాదులు ఎప్పుడెప్పుడు బయటపడదామ, రాజీనామా చేస్తారా అనే దానికి నేడు తెరపడింది. పట్టణంలోని శ్రీ బంకెట్ హాల్లో సోమవారం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించి మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజేష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత శాసనసభ్యుడు విట్టల్ రెడ్డి ఒంటెద్దు పోకడ ప్రవర్తిస్తున్నాడని, కార్యకర్తలకు పట్టించుకోవడంలేదని అధిష్టానానికి పలుమార్లు విన్నవించిన అధిష్టానం పట్టించుకోలేదని దానికి నిరసనగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
తదుపరి కార్యాచరణ మళ్లీ ప్రకటిస్తామన్నారు. రాజీనామా చేసిన వారిలో భైంసా జెడ్పిటిసి సోలంకి దీప, బాసర జడ్పిటిసి వసంత, ఏఎంసీ చై ర్మన్ రాజేష్ బాబు, బాసర ఎంపీపీ సునీత, నాయకులు భీమ్రావు సోలంకి, రమేష్, జాగృతి అధ్యక్షులు పండితరావు, కుంటాలకు చెందిన రమణారావు, మండే శ్రీధర్, లక్ష్మణరావు, చిన్నారావు, బాసర ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వర్, పలువురు సర్పంచులు, నాయకులు సుమారు100 పైగా కార్యకర్తలు పార్టీకి వీడినట్లు తెలిపారు. ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని ఓడించడమే దిశగా పనిచేస్తున్నామని వారు తెలిపారు