Tuesday, November 26, 2024

Jumping Leaders – ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ షాక్… కారుకు బైబై చెప్పి హ‌స్తంకు జై అంటున్న నేత‌లు

న‌ల్గొండ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) కు వ‌రుస షాక్ లు త‌గులుతున్నాయి. టిక్కెట్టు ద‌క్క‌ని ప‌లువురు నేత‌లు పార్టీ వీడుతూనే ఉన్నారు. ఈ జాబితాలో ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని కీల‌క నేత‌లు కూడా చేరారు. . ప‌లు నియోజకవర్గాల్లో భగ్గుమంటున్న అసమ్మతి సెగ‌లు క్ర‌మంలో ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. వీరంద‌రూ కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. సూర్య‌పేట‌కు చెందిన నేత‌లు గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నార‌ని సమాచారం. పార్టీని వీడనున్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బీఆర్ఎస్ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారవులు మంగ‌ళ‌వారం మధ్యాహ్నం కోదాడలో ఉత్తమ్ తో భేటీ అవుతార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ టికెట్ మార్చాలని ప‌లువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇక నల్గొండలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనూ అసమ్మతి సెగ‌లు ఎగిసిప‌డుతున్నాయి. గుర్రంపోడ్ జెడ్పీటీసీతో గాలి రవి కుమార్ తో పాటు 10 మంది సర్పంచ్ లు, 12మంది మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ, పలువురు నాయకులు అధికార పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్నార‌ని స‌మాచారం. నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యే భగత్ ను వ్యతిరేకిస్తూ అక్క‌డి నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. నల్గొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ త‌గిలింద‌ని చెప్పాలి.
మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఐదుగురు అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు కారు దిగ‌బోతున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. చివరిగా నిన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రచారంలో పాల్గొని ఎంపీ కోమటిరెడ్డికి టచ్ లోకి వెళ్లిన కౌన్సిలర్లు.. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు టాక్ న‌డుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ చేరిక‌ల‌తో దూకుడు పెంచ‌గా, అస‌మ్మ‌తితో అధికార పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement