మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై కేసు
జూబ్లీ హిల్స్ పోలీసుల చర్యలు వేగవంతం
ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలుడి మృతి
కారు ఎమ్మెల్యే షకీల్ కుమారుడిదగా గుర్తింపు
విదేశాలకు పారిపోయిన తండ్రీ కొడుకులు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీఓపెన్ చేశారు. 2022లో మార్చ్ 17న రోడ్ నెంబర్ 45లో ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడిపై నుంచి వేగంగా ఓ కారు దూసుకెళ్లింది. అయితే.. ఢీకొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్ చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కానీ, ఈ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి షకీల్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోడ్డుపై బెలూన్స్ అమ్ముకొనే కుటుంబం రోడ్డు దాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దుర్గం చెరువు నుంచి వేగంగా వస్తున్న కారు రోడ్ నంబర్ 45 డివైడర్‌ను ఎక్కి.. చెట్టును ఢీకొట్టింది. అదే సమయంలో రోడ్డు దాటుతున్న బెలూన్స్ అమ్ముకునే కుటుంబంపైకి దూసుకెళ్లింది.
ఇప్పటికే ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసు..
బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ ప్రజా భవన్ వద్ద 2023లో డిసెంబర్ 24న అర్థరాత్రి కారుతో బీభత్సం సృష్టించిన కేసు నడుస్తోంది. పంజాగుట్ట ప్రజాభవన్ సమీపంలో ప్రమాదం జరగడంతో కానిస్టేబుళ్లు సోహైల్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే.. పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగిందో కానీ.. సోహైల్‌కు బదులు షకీల్ ఇంట్లో ఉన్న పనిమనిషిని పోలీసులు ఈ కేసులో ఇరికించారు. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే. ఆయన కుమారుడు విదేశాలకు వెళ్లారు. ఈ కేసులో సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్రపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఇద్దర్ని సస్పెండ్ కూడా చేశారు.