Friday, November 22, 2024

కాంగ్రెస్‌లో జోష్‌.. తెలంగాణలో 40 లక్షలకు చేరిన డిజిట‌ల్ మెంబర్షిప్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ మెంబర్షిప్‌ 40 లక్షలకు చేరుకున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ సభ్యత్వ నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచింది. కాగా సభ్యత్వ నమోదు గడువు గురువారంతో ముగుస్తుంది. గడువును పెంచుతారా..? లేదా అనేది పార్టీ అధిష్టానం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్స్‌రెన్స్‌ సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే. ప్రమాద బీమా ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కాగా, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో పోటి చేసేందుకు టికెట్లు ఆశించే ఆశావాహులు పోటీపడి పార్టీ సభ్యత్వ నమోదు చేయించారు. ఒక్కో నియోజక వర్గంలో టార్గెట్‌కు మించి నాలుగైదంతలు డిజిటల్‌ మెంబర్షిప్‌ చేయించారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి.. సభ్యత్వ నమోదుకు సంబంధించిన డబ్బులు చెల్లింపులు వచ్చే వరకు మెజార్టీ నాయకులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. కొందరు నాయకులు చెక్‌ల రూపంలో టీ పీసీసీకి అందిస్తుండగా.. ఆర్థికంగా వెనుకబడిన వారు మాత్రం సభ్యత్వ నమోదుకు సంబంధించిన డబ్బులు చెల్లించే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ సభ్యత్వానికి తొమ్మిది రూపాయిలు చెల్లించాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించింది. అందులో 4 రూపాయలు సభ్యత్వానికి సంబంధించిన కార్డు ఫ్రింట్‌ కోసం నిర్ణయించారు. తెలంగాణలో మాత్రం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ. 2 లక్షల ప్రమాద బీమా కల్పించాలని టీ పీసీసీ నిర్ణయం తీసుకున్నది. ప్రమాద భీమాకు గాను అదనంగా రూ. 16 వసూలు చేయాలని సూచించింది. పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధిచి రూ. 9, ఇన్స్‌రెన్స్‌ డబ్బులు రూ. 16తో కలిపి మొత్తం రూ. 25 వసూలు చేస్తున్నది. రాష్ట్రంలో నమోదైన 40 లక్షల సభ్యత్వానికి సంబంధించి రూ. 10 కోట్ల వరకు టీ పీసీసీకి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు దాదాపు రూ. 3 కోట్లకు పైగానే వచ్చినట్లుగా కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇన్స్‌రెన్స్‌కు సంబంధించిన డబ్బుల భారాం కార్యకర్తలపై వేయకుండా టీ పీసీసీనే భరిస్తుందని ముందుగా చెప్పారని, ఇప్పుడు ఇన్స్‌రెన్స్‌తో కలిపి మొత్తం డబ్బులు చెల్లించాలని చెబుతున్నారని ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్లగొండ తదితర జిల్లాలోని నూతన జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు వాపోతున్నారు. పార్టీ సభ్యత్వానికి సంబంధించిన డబ్బులు ఎదో విధంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రమాద బీమా డబ్బులను కలిపితే తడిసి మోపడవుతున్నాయన్నారు.

చెక్‌ల రూపంలో టీ పీసీసీకి డబ్బులు అందజేత..

ఇదిలా ఉండగా సభ్యత్వ నమోదుకు సంబంధించిన డబ్బుల చెల్లింపుల విషయంలో ఒక్కో నియోజక వర్గంలో ఇద్దరు నుంచి ముగ్గురు నాయకులు పోటి పడి చెక్‌ల రూపంలో చెల్లిస్తున్నారు. వీరందరు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయనే ఆశతో పని చేస్తున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో కొత్త ముఖాలు ముందుకొస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి పని చేసే వారికి ప్రాధాన్యత ఎలా ఉంటుందోననే అంశంపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement