జోగిపేట,నవంబర్7(ప్రభన్యూస్): అందోల్ జోగిపేట మున్సిపల్ పట్టణంలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు ముక్కుముడిగా రాజీనామా చేస్తున్నారు. ఈనెల 8నబుధవారం జోగిపేట క్లాక్ టవర్ వద్ద సిడబ్ల్యుసి మెంబర్, కాంగ్రెస్ పార్టీ అందోల్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో వీరు కాంగ్రెస్ లో చేరనున్నారు. మంగళవారం జోగిపేట మున్సిపల్ పట్టణంలోని బృందావన్ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 12వ వార్డు కౌన్సిలర్ కొరబోయిన నాగరాజు (నాని),14వ వార్డు కౌన్సిలర్ దుర్గేష్, 20వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్ లు మాట్లాడుతూ, తామంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిలర్ గా ఎన్నికైన నుంచి వార్డుల అభివృద్ధి విషయంపై ఎన్నిసార్లు ఎమ్మెల్యేకు విన్నవించిన పట్టించుకోలేదని వారు ఆరోపించారు.
అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేవని, ఈ విషయంపై ఎమ్మెల్యేతో మొర పెట్టుకున్న ఫలితం లేకపోయిందని, ఒక కౌన్సిలర్ గా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు ఇప్పించకపోతే ఏ మొఖం పెట్టుకొని వార్డులకు వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఎజెండా అంశాలపై మాట్లాడిన సమస్యలు పరిష్కారం కాలేవన్నారు.10 సంవత్సరాలు గడుస్తున్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాటి గానీ, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతి కిరణ్ గాని మున్సిపల్ బిల్డింగ్ నిర్మించుకోలేకపోవడం సిగ్గుగా ఉందన్నారు. వార్డుల సమస్యలు పరిష్కారానికే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలిపారు. దామోదర్ రాజనర్సింహను జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకొని వార్డుల నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు.