హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొలువుల భర్తీలో తెలంగాణ సర్కార్ రికార్డులు సృష్టిస్తోంది. సీఎం కేసీఆర్ అసెంబ్లిd సాక్షిగా ప్రకటించిన 80వేల ఉద్యోగ నియామక భర్తీ పూర్తిస్థాయికి చేరుకుంటోంది. దీంతో నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమ నినాదం తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్తానంలో కీలక దశకు చేరుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ఈ మూడు రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చిరకాలంలోనే భారీగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు చేసిన కృషి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల తప్పిదాలు జరగకుండా ఉండి ఉంటే ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల భర్తీ పూర్తయ్యేదని అధికారులు చెబుతున్నారు.
అయినప్పటికీ ప్రభుత్వ సంకల్పంతో ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. నిరుద్యోగుల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోంది. అనుకోని అవాంతరాలు, ప్రజలకు మెరుగైన పాలన లక్ష్యంతో కలిగిన స్వల్ప ఆటంకాలను అధిగమించి ఆడిన మాటను ఆచరించి చూపేలా కార్యాచరణ చేసింది. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడంతోపాటు, ప్రభుత్వ పాలన మరింత సుస్థిరం చేసేలా సీఎం కేసీఆర్ ఇప్పటికే కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను విస్తరించిన సంగతి విదితమే. ఆ తర్వాత ఆయన తీసుకున్న మరో కీలక నిర్ణయమే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన… తద్వారా నిరుద్యోగులకు ఊతమిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా నిలబెట్టాలన్న తాపత్రయం.
ఇదిప్పుడు నెరవేర్చేందుకు ఆయన ప్రభుత్వపరంగా పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియలో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కృతనిశ్చయంతో కృషి చేస్తోంది. ఈ ఏడాది ఎన్నికల ఏడాది కావడం, ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఉద్యోగ భర్తీకి అవకాశం లేకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం వేగం పెంచింది. ఈ ఏడాదిలోనే వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్లతో విద్యార్థులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు కీలకమైన శాఖల నుంచి సమాచారం సేకరించిన సాధారణ పరిపాలనా శాఖ తుది నివేదికను సిద్ధం చేసి మొత్తం ఖాళీల సంఖ్యతోపాటు నిర్దేశిత పోస్టుల గుర్తింపులో నియామకాలు పూర్తయిన వాటిపై స్పష్టతనిచ్చింది.
దీంతో మిగిలిపోయిన పెండింగ్లను సత్వరమే పూర్తి చేసేలా కార్యాచరణ చేస్తోంది. ఈ క్రమంలోనే గ్రూప్-1, గ్రూప్ 4, గ్రూప్-2 ప్రక్రియలో మరింత పారదర్శకంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా టీఎస్పీఎస్సీ అతి తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాల భర్తీతో రికార్డు సృష్టించింది. దేశంలోనే తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా ఒక్క ఏడాదిలో 60 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ సాకారమవుతోంది. ఈ క్రమంలో 2015నాటికే 13 నోటిఫికేషన్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కార్కు దక్కింది. ఏ లక్ష్యం కోసమైతే ఉద్యమించి స్వరాష్ట్రం సాధించారో తెలంగాణ సర్కార్ ఆ దిశగా తొలినాళ్ల నుంచే అడుగులు వేస్తూ వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 23 జిల్లాలకు ఏడాదికి 3 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి ఉండగా, అప్పటి రాష్ట్ర జనాభా 8 కోట్లకు పైగా ఉండేది. మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఏడాదికి 8వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసుకుంటూ పురోగమిస్తున్నది. 2015నుంచి 2022 వరకు 36,886 ఉద్యోగాలను భర్తీ చేయగా ఈ ఏడాదిలో మరో 60వేలకుపైగా భర్తీ చేసి రికార్డులు సృష్టించింది.
తెలంగాణ ఉద్యమ ఫలాలు స్థానిక యువతకే అందించేందుకు సర్కార్ స్థానికులకే 95శాతం ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చట్టం తీసుకొచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికే 1.35లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ క్రమంలో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను పూర్తి చేసి చిరకాల సమస్యను పూర్తిగా తుదముట్టించారు. ఓసీలకు 44 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49ఏళ్లు, దివ్యాంగులకు 54ఏళ్లకు వయో పరిమితిని పెంచడంతో తెలంగాణ నిరుద్యోగులకు వరంగా మారింది. అదేవిధంగా గిరిజనుల రిజర్వేషన్లు 6 నుంచి శాతానికి పెంచడంతో అందుకు అనుగుణంగా నియామకాలు జరుగుతున్నాయి. ఆయా వర్గాలకు మెరుగైన ఫలాలు అందుతున్నాయి.