Friday, November 22, 2024

TG | సింగరేణిలో ఉద్యోగాలు.. పరీక్షలకు సర్వం సిద్ధం..

సింగరేణి సంస్థలో ఎక్స్‌టర్నల్‌ పోస్టుల భర్తీకి అధికారులు సిద్ధమయ్యారు. మార్చి 1న విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో భాగంగా 10 కేటగిరీల్లోని 272 ఎక్స్‌టర్నల్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్‌ కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేర‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన‌ట్లు సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్. బలరాం గురువారం తెలిపారు.

మొత్తం 18,665 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, అభ్యర్థులు పరీక్షకు గంటన్నర ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల‌ని తెలిపారు. ఇక పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల పరీక్షకు ముందు, తర్వాత వారి బయోమెట్రిక్ వివరాలు సేకరించడం జరుగుతుంద‌ని వివ‌రించారు.

ఇక‌ పోటీ పరీక్షల నిర్వహణలో అపార అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈడీసీఎల్ వారి ఆధ్వర్యంలోనే పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్ జంటనగరాల్లోని 12 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే మోసగాళ్ల వలలో పడవద్దని, కష్టాన్ని నమ్ముకుని పరీక్షలో విజయం సాధించాలని సూచించారు. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వారి వివరాలను సంస్థ విజిలెన్స్ విభాగం, పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాల‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement