రాజకీయాలకు అతీతంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం లకోర గ్రామంలో మంగళవారం మంత్రి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని యువతకు రాజకీయాలకతీతంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, యువత ప్రతి చిన్న అవకాశాన్ని చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి రంగంలో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తున్నామని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి గ్రామానికి డబుల్ రోడ్లు జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి నాలుగు లైన్ల రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
ప్రతి గ్రామంలో సిసి రోడ్లను నిర్మించామని, ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించామని, తాను అడిగిన ప్రతి పనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడం వల్లే ఈ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచగలిగానని ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలను నియోజకవర్గ ప్రజలకు పెద్ద ఎత్తున అందజేశామని, తాను గ్రామాల్లో పర్యటించే సందర్భంలో ఎంతోమంది తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తన దృష్టికి తేవడం జరిగిందన్నారు. నియోజకవర్గాన్ని తాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ప్రజలు అడుగుతున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆశయంతోనే నేడు మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. తాను గతంలో హైదరాబాదులో 16వేల రూపాయలకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశానని, ప్రైవేట్ కంపెనీలో తమ నైపుణ్యం తమ సామర్థ్యం పై కంపెనీల వారు జీతాలు చెల్లిస్తారని యువత తమకు అంది వచ్చిన అవకాశాలు చేజార్చుకోకుండా ఉద్యోగాల్లో చేరి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే కంపెనీల వారు వారి జీతాలు పెంపు చేస్తారన్నారు.
తాను ప్రవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే సందర్భంలో ప్రతినెలా తన నైపుణ్యాన్ని చూసి జీతం పెంచే వారని మంత్రి గుర్తు చేశారు. గతంలో ఉద్యోగాల కోసం హైదరాబాదు లాంటి ప్రాంతాలకు వెళ్లి వెతుక్కోవాల్సి వచ్చేదని అటువంటి ఇబ్బందులు కలకుండా ఉండేందుకే ఎక్కడో పెద్ద పట్టణాల్లో ఉండే కంపెనీల వారిని బాల్కొండ నియోజకవర్గం తీసుకువచ్చి యువతకు పరిచయం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో తాను జాబ్ మేళాను ఏర్పాటు చేశానని వివరించారు. జాబ్ మేళా కార్యక్రమాన్ని రాజకీయాలు చేయడం కాదని, ఓట్ల కోసం కాదని, జాబ్ మేళా కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో నిరంతరాయ ప్రక్రియగా కొనసాగిస్తానని మంత్రి ప్రశాంత్ రెడ్డి యువతకు వివరించారు.