Monday, November 11, 2024

రెసిడెన్షియల్‌ విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు విదేశాలలో ఉద్యోగవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శనివారం బీఆర్కే భవన్‌లో ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ జనరల్‌ థియెర్రి బెర్తెలాట్‌ నేతృత్వంలోని బృందం అలయాన్స్‌ ఫ్రాన్కైస్‌ డైరెక్టర్‌ శ్యామ్యూల్‌ బెర్తేట్‌, సఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌ సంస్థ డైరెక్టర్‌ గెరార్డ్‌ ఫ్రాంకోయిస్‌ ఇనిజాన్‌, మెనిన్‌ ఇండియా సంస్థ డైరెక్టర్‌ జెర్మైన్‌ అరౌద్‌లతో రాష్ట్ర షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్‌ క్రిస్టినా చోంగ్తు, గిరిజన, షెడ్యూల్డ్‌ కులాల రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెసిడెన్షిల్‌ విద్యా సంస్థలో విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగవకాశాలు, విద్యార్థుల్లో నిపుణత, ప్రతిభా సామర్థ్యాలను పెంపొందించడం, ఫ్రెంచ్‌ భాషలో శిక్షణ వంటి అంశాలపై చర్చించారు.

అనంతరం గిరిజన, షెడ్యూల్డు కులాల రెసిడెన్షియల్‌ సంస్థల కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల భవిష్యత్‌కు సీఎం కేసీఆర్‌ చొరవ చూపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ సంస్థల విద్యార్థులకు గ్లోబల్‌ వర్క్‌ ప్లేస్‌ పని విధాన సంస్కృతి, విశ్వ విద్యాలయాలు, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థల ప్రమాణాలపై అవగాహన కల్పించడమే ఈ సమావేశ ప్రధానోద్దేశ్యంమని వివరించారు. అట్టడుగు స్థాయి నిరుపేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలను పొందగలరని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ విద్యా సంస్థలు, గ్లోబల్‌ కార్పోరేషన్ల మధ్య ఈ విధమైన సమావేశం జరగడం దేశంలోనే మొట్ట మొదటిదని రోనాల్డ్‌ రోస్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement