హైదరాబాద్, ఆంధ్రప్రభ : కరోనా జేఎన్.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రత్తమైంది. మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా టెస్టులను నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతీ రోజూ పెద్ద సంఖ్యలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులకు నిర్దేశించింది. పల్లె, బస్తీ దవాఖానాలతోపాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల పరిధిలోని ప్రజలకు ర్యాపిడ్ యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇటీవల ఉస్మానియాలో ఇతర అనారోగ్య సమస్యలతో చేరి పరిస్థితి విషయమించి మృతిచెందిన ఇద్దరికి సాధారణ పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. తాజాగా మరో మహిళతోపాటు ఇద్దరు పీజీ మెడికలో ఉస్మానియాలో కరోనాతో చేరారు. గాంధీలోనూ కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు న్యూమోనియాతో నీలోఫర్‌లో చేరిన ఓ చిన్నారికి బుధవారం కరోనా నిర్ధారణ అయింది. భూపాలపల్లి , సంగారెడ్డి జిల్లాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సంగారెడ్డిలో ఒకే ఇంట్లో అయిదుగురికి కరోనా సోకిన విషయం తెలిసిందే.
మరోవైపు ప్రతీ రోజూ రెండెంకల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విస్తృతంగా కోరోనా యాంటిజెన్ టెస్టులు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రులకు కరోనా టెస్టింగ్ కిట్లను పంపారు. కరోనా మొదటి, రెండో వేవ్‌లలో ప్రతీ రోజూ లక్ష దాకా కరోనా టెస్టులు చేసేవారు. ప్రస్తుతం రోజూ లక్ష దాకా కాకపోయినా లక్షణాలు బహిర్గతమైన వారందరికీ టెస్టులు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
జాగ్రత్తలు పాటిస్తే ఆందోళనకర పరిస్థితులు రావు.. ప్రజారోగ్యశాఖ
కరోనా జేఎన్.1 వేరియంట్‌తో ఆందోళన అవసరం లేదు. అయితే తగిన కరోనా జాగ్రత్తలు మాత్రం తప్పక తీసుకోవాలి. ముఖ్యంగా యువత, కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేసే వారు కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇటీవల అసింప్టమాటిక్ కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. యువతకు సోకిన వైరస్ వారికి పెద్దగా హాని కలిగించకపోయినా వారి ద్వారా ఇంట్లోని చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు సోకి ప్రాణాంతకంగా మారుతోంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణా పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలితే ఇంటికే పరిమితం కావాలి.
కరోనాకు సొంత వైద్యం వద్దు..
కరోనాకు కొంత మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. సొంత వైద్యం మంచి పద్దతి కాదు. కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం, ఒల్లు నొప్పులు కనిపిస్తే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. గాంధీలో ఎనిమిది మంది కరోనా పేషెంట్లు ఉన్నారు. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది.