హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకున్నది. సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఒకరినొకరు పలకరించుకుని మాట్లాడుకున్నారు. ‘ జీవన్‌రెడ్డి.. మా గురించి చాలా మాట్లాడుతున్నావు ఏంటీ..? ‘ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. దీనికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పందిస్తూ .. ‘ అవును మా బాస్‌ను ఒక్క మాట అంటే వంద మాటలంటాం.. బరాబర్‌గా అంటాం ‘ అని బదులిచ్చారు. ‘ నేను సీఎం కేసీఆర్‌ను ఏమి అనలేదు.. మీడియా వాళ్లు కేసీఆర్‌కు హెల్త్ బాగోలేదని చెబితే.. ఐదు రాష్ట్రాల న్నికల ఫలితాలు చూసి ఏమో అని మాత్రమే అన్నాను ‘ అని రాజగోపాల్‌రెడ్డి జవాబిచ్చారు.
సీఎం కేసీఆర్ హాస్పటల్‌కు వెళ్లిన విషయం తెలియదన్నారు. అందుకు జీవన్‌రెడ్డి బదులిస్తూ పై నుంచి ఆదేశాలు రావడంతోనే నిన్ను తిట్టానని తెలిపారు. మేము తెలంగాణ తెస్తే మమ్ముల్నే తిడుతున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసినందుకు మీ కుటుంబంపై తమకు గౌరవం ఉందని జీవన్‌రెడ్డి తెలిపారు. సోనియా గాంధీని కూడా తామెప్పుడు విమర్శించమని, ఎందుకంటే ఆమె తెలంగాణ దేవతన్నారు. తాము కేవలం రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీనే తిడుతున్నామన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రాదని, మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని జీవన్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.