ఆపత్కాలంలో సాటి మనిషిని ఆదుకోవడానికి మించిన మానవత్వం లేదని, అటువంటి వారంందరూ మహానుభావులే అని తెలిపారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ మేరకు ఇటీవల అత్తాపూర్ దగ్గర బాలాజీ అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండెనొప్పి తో పడిపోతే అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ తక్షణమే స్పందించి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. ఇటువంటి గొప్ప మానవతా మూర్తిని స్వయంగా కలుసుకోవాలని, కానిస్టేబుల్ రాజశేఖర్ ని స్వయంగా తన జేడీ ఫౌండేషన్ కార్యాలయానికి పిలిపించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… వృత్తిలో నిబద్ధత కలిగి, సేవా భావంతో పనిచేయడం గొప్ప విషయమని, అటువంటి పనిచేసిన రాజశేఖర్ గొప్ప మానవతా మూర్తి అని ప్రశంసించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ రాజశేఖర్ మాట్లాడుతూ… తన జీవితంలో ఈ రోజు మరిచిపోని రోజు అని, జేడీ లక్ష్మీనారాయణ ను స్వయంగా కలవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానని ఈ రోజు జేడీ సర్ స్వయంగా తనను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మురళి మోహన్ కుమార్ తో పాటు, న్యాయ విద్యార్థి మనిదీప్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.