Tuesday, November 26, 2024

అడవిని నరికి పోడు చేస్తే కఠిన చర్యలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నూతనంగా అడవిని నరికి పోడు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఒక ప్రకటనలో హెచ్చరించారు. పోడు భూములకు ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలను ప్రభుత్వం ఇస్తుందనే ఉద్దేశంతో జిల్లాలో కొత్తగా అటవీలోని వృక్ష సంపదను నరికి పోడు చేస్తున్నారనే సమాచారం అందుతుందని, నూతనంగా అటవీ భూమిలో పోడు చేసుకొనే వారినుండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలు అందించేందుకు దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. నూతనంగా పోడు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. నూతనంగా అడవిని నరికి పోడు చేసుకునే వారిని పోలీసు, అటవీశాఖల ద్వారా గుర్తించి ఆయా శాఖల ద్వారా సంబంధిత పోడు చేసే వ్యక్తిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రైతులను నూతనంగా అడవిని నరికి పోడు చేసుకోవడానికి ప్రోత్సహించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ జిల్లాలో నూతనంగా ఎక్కడైనా అడవి భూమిని పోడు భూమిగా మార్చే ప్రయత్నాలు జరిగితే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement