జనగామ: అంతర్జాతీయ స్థాయిలో సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ నిర్వహించిన పోటీల్లో ఓ మారుమూల పల్లెకు చెందిన అమ్మాయి సత్తా చాటింది. వివిధ దేశాల విద్యార్థులతో పోటీ పడి ప్రధమ స్థానంలో నిలిచింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన పొన్నాల సోమిరెడ్డి-భారతి దంపతుల కూతురు భాషిత ఈ ఘనత సాధించింది. సోమిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం దృష్ట్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. భాషితను ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది.
గత నెల 29న నెట్వర్కింగ్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆసియా పసిఫిక్ జపాన్ అండ్ గ్రేటర్ చైనా(ఏపీజేసీ) నెట్క్యాడ్ రైడర్స్ పోటీలు నిర్వహించగా భాషిత పాల్గొంది. ఆన్లైన్ కాంపిటీషన్స్‌లో దేశవ్యాప్తంగా 994 మందితో పోటీ పడి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల 24న జరిగే అంతర్జాతీయ స్థాయి ఫైనల్స్‌లో 15 దేశాలకు చెందిన టాపర్స్‌తో ఆమె పోటీ పడనుంది. అందులోనూ గెలిచి గ్లోబల్ టాపర్‌గా నిలుస్తానని భాషిత ధీమా వ్యక్తం చేశారు. పల్లెలో పుట్టి పెరిగిన విద్యార్థిని ప్రపంచ స్థాయిలో ర్యాంకు సాధించడం జనగామ జిల్లాకే గర్వకారణమని పలువురు హర్షం వ్యక్తం చేశారు..