Friday, November 22, 2024

సాగర్ లో జనసేన మద్దతు ఎవరికో..

ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ నియోజకవర్గం తెరాస అభ్యర్థి పీవీ కుమార్తె వాణిదేవికి మద్దతు తెలిపిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎవరి వైపు నిలబడతారోనన్న ఉత్కంఠ సాగుతోంది. విజయవాడలో జరిగిన బీసీమోర్చ సమావేశంలో ప్రసంగించిన మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఈ ఉపఎన్నికలో జనసేన మద్దతు తమకేనని ప్రకటించారు. జనసేన తరపు నుంచి ఈ అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఉపఎన్నిక అనివార్యమని తేలడంతో తెలంగాణ తెలుగుదేశంపార్టీ ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలబెడతామన్న ప్రకటన చేసింది. నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి మువ్వా అరుణ్ కుమార్‌ను పోటీకి పెడుతున్నట్లు పార్టీ జాతీయ నేత అరవింద్ కుమార్ గౌడ్ ప్రకటించారు. నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు పదివేలకుపైగా ఉన్నారని వారంతా తమకు మద్దతు పలుకుతారన్న లెక్కలను తెదేపా వేసుకుంటోంది.

ఏదేమైనా దుబ్బాక, జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరుగుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా, సవాల్ గా తీసుకున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభకు ఎన్నిక కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన హుజూర్ నగర్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో తెరాస విజయకేతనం ఎగరవేసింది. ఈ ఫలితాలు ఇక్కడ పునరావృతం కావాలని తెరాస పార్టీ శ్రేణులకు చెబుతోంది. ఆ దిశగా ప్రణాళిక రూపొందించాలని సీఎం కేసీఆర్ చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement