Wednesday, January 22, 2025

TG | గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ.. కేటీఆర్

  • ఇక త్వ‌ర‌లోనే త‌రిమికొట్టడమూ ప‌క్కా
  • రేవంత్ స‌ర్కార్ కు కేటీఆర్ మాస్ వార్నింగ్


హైద‌రాబాద్ – కాంగ్రెస్ సర్కారుపై ప్రజా తిరుగుబాటు మొదలైందని.. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయ్యిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇక త‌రిమి కొట్ట‌డ‌మే మిగిలిందంటూ వ్యాఖ్య‌నించారు.. గ్రామస‌భ‌ల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ నేత‌ల‌పై తిరుగ‌బ‌డుతున్న దానిపై ఆయ‌న స్పందిస్తూ… అసమర్థ ముఖ్యమంత్రి.. అసలు స్వరూపం బట్టబయలైందన్నారు.

ఇక కాలయాపనతో కాలం సాగదని.. అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదన్నారు. ఈ దరఖాస్తుల దందా నడవదని, ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదని హెచ్చరించారు. నమ్మించి చేసిన నయవంచనకు నాలుగుకోట్ల సమాజం ఊరుకోదన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గ్రామసభలు అట్టుడికాయన్నారు. గ్రామసభలా.. ఖాకీల క్యాంప్ లా? అంటూ ఎక్స్ ద్వారా ప్రశ్నించారు.

సంక్షేమ పథకాల కోసమా..? కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా అన్నారు. ఖాకీల దౌర్జన్యాలు, కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు జరుగుతున్నాయన్నారు. పోలీసు పహారాలో గ్రామలను నింపేసి గ్రామసభలా ? అని ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులుమే సమాధానమా ? అంటూ నిలదీశారు. ఇదా.. మీరు చెప్పిన ప్రజాపాలనా ? ఇదా.. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా ? అని ప్రశ్నించారు. పోలీసుల నడుమ.. అంక్షల నడుమ.. పథకాలకు అర్హుల గుర్తింపట! అంటూ నిలదీశారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు కాంగ్రెస్ పాలన సాగుతుందంటూ సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు.

- Advertisement -

ఎమ్మెల్యే ప‌ద్మారావుకి పరామ‌ర్శ …
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మారావు గౌడ్‌ను కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. టకారబస్తీలోని ఆయన నివాసంలో పద్మారావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మారావు గౌడ్ ఉత్తరాఖండ్ రాజ‌ధాని డెహ్రాడూన్ ప‌ర్యటనలో ఉండ‌గా గుండెపోటుకు గుర‌య్యారు.. అక్క‌డ హస్పిట‌ల్ చికిత్స పొందిన ఆయ‌న నేడు న‌గ‌రానికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement