Friday, November 22, 2024

Jamili Tension – ఆశావహుల్లో ఆనందం.. అభ్యర్థుల్లో బెంగ

జమిలి ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ
అందరి చూపు పార్లమెంట్‌ సమావేశాల వైపే
ఈ నెల 22 తర్వాతే భవిష్యత్‌ పై నిర్ణయాలు
క్లారిటీ కోసం వేచి చూస్తున్న అసంతృప్తులు
తడిసి మోపెడు కానున్న అభ్యర్థుల ఖర్చు
ఆనందంలో టికెట్‌ రాని ఆశావహులు
కేంద్రం నిర్ణయంపై ఆచి తూచి ముందుకు
జమిలి ఉంటుందా..? ఉండదా..? అనే చర్చ
భారాస అధినేత నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న జమిలి ఎన్నికల అంశం ఇప్పుడు అన్ని పార్టీలకు అంటుకుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న భారాస జమిలి ఎన్నికల పై ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఎన్నికలు వస్తాయా, రావా..? వస్తే పరిస్థితి ఏంటీ..? లేదంటే రాకపోతే చేపట్టాల్సిన కార్యచరణ ఏంటీ..? అనే అంశాలపై సుదీర్ఘ కసరత్తును అధినేత చేస్తున్నారు. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలను కేంద్రం నిర్వహిస్తుండటంతో అందరూ ప్రస్తుతానికి సైలెంట్‌గా కనిపించినా.. నియోజకవర్గాల్లోని పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారిక కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు. తెలంగాణలో అన్ని పార్టీల కన్నా ముందే బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఎక్కువ మంది తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో సీటు- ఆశించి భంగపడ్డ వారు ఇతర పార్టీల్లో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఇలాంటి తరుణంలో జమిలి ఎన్నికల అంశాన్ని కేంద్రం తెరమీదకు తెచ్చింది. దీంతో ఒక్కసారిగా ఎక్కడి వారు అక్కడే గప్‌ చుప్‌ అన్నట్లు- సైలెంట్‌ అయిపోయారు. ఇంత వరకూ హంగామా ఆర్భాటాలు ప్రదర్శించిన నేతలంతా ఎందుకు ఒక్కసారిగా ఉలుకు పలుకు లేకుండా అయిపోయారనే అనుమానం స్థానిక నేతలతో పాటు ప్రజల్లోనూ నెలకొంది.

కరగనున్న ఆస్తులు..
ఎన్నికల్లో పోటీ చేయాలన్నా.. గెలవాలన్నా.. ఓడాలన్నా.. డబ్బు లేనిదే రాజకీయం చేయలేమన్న విధంగా ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి. పార్టీ నేతలు డబ్బు ఇప్పుడు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికలకు ముందుగా సై అని ప్రకటించిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఒకవేళ జమిలి ఎన్నికలు అంటే ఇంకా ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. సాధారణంగా తెలంగాణ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలు, పోటీ చేయబోయే అభ్యర్థులు, ఆశావహులు ఈ మూడు నెలలు ఎలా గడుస్తాయిరా దేవుడా అని తలపట్టు-కున్నారు. దీనికి కారణం కార్యకర్తలు మొదలు పార్టీ శ్రేణుల వరకూ అందరినీ తన వైపు ఆకర్షించుకునేందుకు, వారి యోగ క్షేమాలు చూసుకునేందుకు విపరీతమైన డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలే తట్టు-కోలేక పోతున్న నాయకులు ఇక జమిలి వస్తే ఆరు నెలలు వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడబోతుంది. దీంతో ఇళ్లు, పొలాలు, నగలు తాకట్టు- పెట్టాల్సిందే అని ఎమ్మెల్యే టికెట్‌ సాధించిన అభ్యర్థులు అత్యంత సన్నిహితుల వద్ద మనోగతాన్ని పంచుకుంటున్నారు.

ఆశావహులు, అసంతృప్తుల ఎదురు చూపులు
రానున్న అసెంబ్లిd ఎన్నికలు బీఆర్‌ఎస్‌లో సిట్టింగులకు సంకటంగా మారబోతున్నాయని గులాబీ నేతలు వెల్లడిస్తున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల వద్ద ఉన్న సంపద కరిగిపోయే ప్రమాదం వచ్చి పడింది. దీంతో టికెట్‌ రాక నిరాశ పడ్డ వారు కొంత వరకూ ఖర్చు తగ్గిందని ఆనందిస్తున్నారు. అయితే తాము ఏదైనా పార్టీలోకి వెళ్లి అక్కడ టికెట్‌ తెచ్చుకుందాం అనుకొని వేచి చూస్తున్న సమయంలో ఈ జమిలి అసంతృప్తులపై నీళ్లు చల్లింది. ఇప్పుడు ఏ పార్టీ నుంచి అయినా టికెట్‌ వస్తే లేని పోని ఖర్చులు మీదొచ్చి పడతాయి అని భావిస్తున్నారు. పైగా అక్కడి క్యాడర్‌ ఏంటో తమకు తెలియదని అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. నాయకుల తీరు ఏంటో అర్థం కాదంటున్నారు. అలాంటి సమయంలో ఉన్న పార్టీని వీడి మరో పార్లీలో చేరడం అంటే కొత్త సమస్యలను తానే కొని తెచ్చుకున్నట్లని భావిస్తున్నారు. ఈనెల 18 నుంచి 22 వరకూ జరిగే ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈనెల 22 తరువాత కొంత క్లారిటీ- అయితే వస్తుందని సిట్టింగ్‌లతో పాటు ఆశావహులు, అసంతృప్తులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement